దేవుడుగా కృష్ణుడు--10- Truth about Gita



మానవుడుగా కృష్ణుడికంటె, రాజనీతిజ్ఞుడుగా కృష్ణుడికంటె, దేవుడుగా కృష్ణుడికి అంత ఖ్యాతి లేదు. మహాభారతంలో మనిషిగా ప్రవేశించి దేవుడుగా నిష్ర్కమిస్తాడు. పురాణాలలో అద్యంతాలూ దేవుడుగానే ఉంటాడు. కనుక ఇతిహాసాలూ, పురాణాలు కలిపి చూస్తే కాని, దేవుడి విషయం బయటపడదు.
కృష్ణుడి బాల్యదశలో చేష్టలూ, అద్భుతాలూ అంతగా బంకించంద్ర చటర్జీ పట్టించుకోలేదు. కృష్ణుడి దైవత్వంలో మాత్రం నమ్మకం ఉంచాడు. బాల్యదశలో చెప్పినవన్నీ అలంకార ప్రాయాలన్నాడు. పిఠాపురం పెండ్యాల శాస్ర్తి ఈ అద్భుతాల గురించి నిర్మొహమాటంగా చెప్పారు. పూతన చిన్న పిల్లలరోగమనీ, రాక్షసి కాదనీ అన్నాడు. భారతీయ వైద్య గ్రంధాలలో ఆ రోగ ప్రస్తావన ఉన్నది. ఇప్పటికీ గ్రామాలలో పిల్లల జబ్బుల్ని పోగొట్టటానికి కొన్ని క్రతువులు చేస్తుంటారు. కేసి, సాదేరధ, ఉల్లూక అనే దయ్యాలను కంసుడు కృష్ణుడిపైకి పంపిస్తాడు. రెండు చెట్లమధ్య కృష్ణుడిని కట్టేసినట్లు చెప్పిన కథలో ఉల్లూక అనేది దోషపూరిత దయ్యం పేరే. మిగిలిన కృష్ణలీలలు కూడా ఊహించిన మూఢనమ్మకాలే అని పెండ్యాల శాస్ర్తి పేర్కొన్నాడు.
కౌరవసభలో ద్రౌపది వస్ర్తాపహరణం జరుగుతుండగా ఆమె కృష్ణుడిని ప్రార్థించటం, అతడు దివ్యశక్తులలో ఆమెను కాపాడటం కథగా చెపుతారు. శాస్త్రి ఈ విషయమై రాస్తూ మహాభారతంలో 13 సందర్భాలలో ఈ అవమాన ప్రస్తావన ఉన్నదనీ, 3 సార్లు వివస్ర్తను చేయటనికి ప్రయత్నించారనీ, మిగిలినప్పుడు కథలో ఆమెను జుట్టుపట్టుకొని ఈడ్చారనీ ఉన్నది. రెండు సందర్భాలలో మాత్రం తన అవమానాన్ని గురించి కృష్ణుడికి నివేదించుకున్నది. అందులో తనను వివస్త్ర గావించటానికి చేసిన ప్రయత్నం గురించి గానీ, తనను కాపాడినందున కృతజ్ఞతగానీ తెలిపినట్టు లేదు. ఈ ఉదంతం జరిగినప్పుడు కృష్ణుడు ద్వారకలో లేడు. సాళ్వుడితో పోరాటం అంటూ ఏమీ లేదు. తిరిగివచ్చిన తరువాత యుధిష్టిరుడి జూదం, దాని తీవ్ర పరిణామాలూ విన్నాడు. కనుక ద్రౌపది మొరబెట్టుకోటం, కృష్ణుడు కాపాడటం ఆధారాలు లేవు. భాసుడూ, భారవీ, క్షేమేంద్రుడూ మహాభారతాన్ని గురించి రాసినప్పుడు ద్రౌపదీ వస్త్రాపహరణం ప్రస్తావన లేదు.
రాజసూయ యాగంలో ముందుగా ఎవరిని గౌరవించాలనే విషయమై పేచీరాగా కృష్ణుడికి వ్యతిరేకంగా ఉన్న శిశుపాలుడు పోరాటానికి సన్నద్ధుడై వెళ్ళిపోతాడు. యుధిష్టిరుడతణ్ణి శాంతింపజేసి తీసుకువస్తాడు. అయినప్పటికీ శిశుపాలుడు తన అభ్యంతరాన్ని కొనసాగిస్తుండగా కృష్ణుడు చక్రంతో అతణ్ణి హతమారుస్తాడు. కృష్ణుని ప్రేరేపణతో భీముడు జరాసంధుడిని చంపుతాడు. జరాసంధుడు అప్రమత్తుడుగా లేనప్పుడు అది జరిగిందని శాస్త్రి రాశాడు.
శీతానాధ్ తత్వభూషణ్ కృష్ణుడి దైవలీలను గురించి తీవ్ర ఆరోపణలు చేశాడు. కంసుణ్ణి చంపిన తీరు ప్రస్తావిస్తూ కంసుడు పురికొల్పినప్పుడు పోరాటంతో కృష్ణుడతణ్ణి చంపలేదనీ, మల్లయుద్ధం పోటీలు తిలకిస్తున్న కంసుణ్ణి హఠాత్తుగా జుట్టుపట్టుకొని వేదిక నుండి కిందికి విసిరేసి చంపాడని అంటాడు. శిశుపాలుడూ, సాల్యుడు, శతధన్వుడు కృష్ణుడి చేతిలో చనిపోయిన తీరుగూడా అతడు ప్రస్తావించాడు. పురాణాల రచయితలకు చంపడం దివ్యచర్యగా ఉన్నది. కృష్ణుడు తన దివ్యత్వాన్ని ప్రశ్నించిన పౌండ్రుని చంపాడు. పౌంద్రుడు ద్వారకపై దండెత్తినట్లు కూడా రాశాడు. కృష్ణుడు ధరించిన విష్ణు చిహ్నాలను, శంకుచక్రాలను, పద్మం, పౌండ్రుడు ప్రశ్నించాడు. అందుకే కృష్ణునికి ఆగ్రహం వచ్చింది. (Seetanath Tatwabhushan : Krishna And the Geetha, Calcutta).
కృష్ణుడు అపహరణల్లోనూ ప్రసిద్ధి చెందాడు. శిశుపాలుడితో పెళ్ళాడాల్సిన రుక్మిణిని ఒకరోజు ముందు అపహరించాడు. మిత్రవిందను స్వయంవర సభ నుండి అపహరించాడు. మద్రరాజు కుమార్తె లక్షణాలను బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్ళి చేసుకున్నాడు. నరకుడి కొలువులోని 16 వేల మంది స్ర్తీలను భార్యలుగా స్వీకరించాడు. భార్యల సంఖ్య 16,008 కాగా, పురాణాల ప్రకారం 16,022 అని బంకించంద్ర చూపాడు. హరివంశం ప్రకారం కృష్ణుడికి ఆడపిల్లలు లేరు. మగ సంతానం లక్ష 80 వేలు మాత్రమే. భాగవతాన్ని బట్టి కృష్ణుడు 125 ఏళ్ళు బతికాడు. దీని ఆధారంగా బంకించంద్ర లెక్కలు వేసి రోజుకు 4 గురు చెప్పున కృష్ణుడు పిల్లలను కన్నాడని చెప్పాడు. కృష్ణుడు 14 ఏళ్ళ వరకూ పిల్లలను కనజాలడనీ, 80వ ఏడు తరువాత పిల్లల లేరనీ మజుందార్ చూపాడు. మిగిలిన 66 ఏళ్ళలో రోజుకు 7.5 కుమారులు చొప్పున పుట్టారన్న మాట.
కృష్ణుడు ఒక పథకం ప్రకారం ద్వారకా నగరాన్ని రూపొందించాడని పురాణాలు చెపుతున్నాయి. హరివంశం ప్రకారం ద్వారకలో వేలాది మంది స్త్రీలను వ్యభిచారంలో ఉన్నవారిని స్థిరపరిచారు. హరివంశం ప్రకారం ఆ స్త్రీలకు తగ్గట్లే పురుషుల్నీ, వసతి గృహాల్నీ తెరిపించాడు. ఆనాడు కృష్ణుడి సోదరుడు బలరాముడే పెద్ద తాగుబోతు. కల్లుముంత లేకుండా అతడు కనిపించేవాడు కాదు. అందుకే హరిప్రియ అని కల్లుకు మారుపేరు వచ్చింది. అక్కడ అన్ని రకాలైన మాంసభక్ష్యాలూ లభించేవి. కృష్ణుడు కూడా వాటిననుభవించే వాడు. మజుందార్ ద్వారకను గురించి రాస్తూ హరివంశం ప్రకారం యాదవులు ఈ స్త్రీలను తమ కుటుంబాలతో పాటు సముద్ర తీరాలకు తీసుకువెళ్ళి జలకాలాడుతూ, తాగుతూ తింటూ అనుభవించేరన్నాడు. కృష్ణుడి సంతానం, ఇతర కుటుంబీకులూ, బట్టలూ, నగలూ ఒడ్డున పెట్టి జలక్రీడలలో నిమగ్నులయ్యేవారు. యాదవ స్ర్తీ పురుషులంతా తాగుడుకు అలవాటు పడ్డవారే.
ద్వారకానగరం పవిత్రమో కాదో గాని, కృష్ణుడి ఆధ్వర్యంలో విలాసవంతంగా మాత్రం ఉన్నది. హరివంశం ప్రకారం అలా ఉన్నదన్నా సనాతనులకాగ్రహం వస్తుంది. సుక్తాంకర్ అదంతా మూర్ఖత్వంగా కొట్టిపారవేయదలిచాడు. కృష్ణుడు తన దైవలీలల్ని అనేక సందర్భాలలో చూపినా, చదువుకున్నవారు సహితం వాటి లోతుపాతుల్ని చూడలేక పోతున్నారన్నాడు.
కృష్ణుడి విషయంలో ఉత్తమ నిర్ణేతలు యాదవులే. వారి దృష్టిలో అతడు దేవుడు కాదు. వారెప్పుడూ అతణ్ణి పూజించలేదు. మజుందార్ ఈ విషయాలను స్పష్టంగా రాశాడు. అక్రూరుడూ, కృతవర్మ కృష్ణుడి పట్ల శమంతకమణి విషయంలో చూపిన ధోరణి, శిశుపాలుడూ, దంతవక్ర్తుడు, దైవాతకుడూ, ప్రభాసుడూ కృష్ణుడిపట్ల గౌరవం చూపలేదు. అతడిని దేవుడుగా చూడకపోవటం యాదవుల దురదృష్టమని భాగవతంలో అన్నారు.
కృష్ణుడి కొడుకులు ప్రద్యుమ్నుడూ, సాంబుడు సహితం తండ్రిని గౌరవించలేదు. పెంపుడు తల్లి మాయాదేవిని ప్రద్యుమ్ముడు పెళ్ళాడాడు. హరివంశం వజ్రనాభుడి కుమార్తె ప్రభావతిని ప్రద్నుమ్నుడు ఆకట్టుకుంటాడు. కృష్ణుడి 16 వేల మంది భార్యల్నీ అతని కుమారుడు సాంబువాడుకున్నట్లు, వరాహపురాణం చెపుతున్నది. అందుకు సాంబుడిని కుష్టురోగిగా సాంబువాడుకున్నట్లు శపిస్తాడు. ద్వారకా నగరంలో పురుష జనాభా హరించి పోతుండగా వారిని కాపాడాలని అర్జునుడు ప్రయత్నించి కూడా విఫలుడౌతాడు. హస్తినా పురానికి తీసుకువెళుతున్న ద్వారక జనాన్ని అర్జునుడు కాపాడలేక పోయాడు. ఆఖరులో వారిపై దండెత్తి చాలామంది స్త్రీలనెత్తుకపోయారు. అందులో ముగ్గురు తప్ప, కృష్ణుడి భార్యలు కూడా ఉన్నారు.
కృష్ణుడి దివ్యత్వాన్ని చాలామంది నమ్మలేదు. హాప్ కిప్స్ ఈ విషయం రాస్తూ గీత ప్రకారం కృష్ణుడిని దేవుడుగా గుర్తించి పూజించిన వారు కొద్దిమందే అన్నాడు. (గీత 9వ అధ్యాం, 11వ శ్లోకం) పతంజలి మహాభాష్యం కూడా కృష్ణుడిని నాయకుడిగా తప్ప దేవుడుగా గుర్తించలేదు. (E.W. Hopkins : The Great Epic of indian Literature)
శీతానాధ్ తత్వభూషణుడి ప్రకారం కృష్ణుడి కథ అంతా అద్భుత కల్పనలే. మహాభారతం, పురాణాలూ ప్రస్తావించినదాన్ని బట్టి చూస్తే కృష్ణుడు దైవావతారం కానేరదు.
డి.డి. కోశాంబి ధైర్యంగా, నిర్మొహమాటంగా కృష్ణుడు గురించి రాశాడు. అవకాశవాదానికి ఆయువు పట్టుగా ఉన్న గీతావాదనలు నాటి సమాజంలోని ఆదిమ ఉత్పత్తి దశకూ, మతానికీ ప్రతిబింబంగా ఉన్నవన్నారు. (D.D. Kosambi) కోశాంబి లాంటివారే అలా మాడుపగుల కొట్టగలిగేట్లు చెప్పగలరు.
By Narla Venkateswararao Telugu: Innaiah Narisetti

No comments:

Post a Comment